అణుశక్తి రంగ ప్రగతికి అద్దం మాస్కో మ్యూజియం
అణుశక్తి మ్యూజియాన్ని సందర్శించిన మంత్రి లోకేష్
మాస్కో,జూన్7: రష్యా పర్యటనలో ఉన్న రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ మాస్కోలోని ప్రతిష్ఠాత్మక అణుశక్తి మ్యూజియాన్ని సందర్శించారు. ప్రపంచంలోనే అత్యాధునిక సాంకేతిక ప్రదర్శన కేంద్రాల్లో ఒకటిగా గుర్తింపు పొందిన ఈ మ్యూజియంలోని వివిధ విభాగాలను పరిశీలించి, అక్కడి నిర్వాహకులతో మంత్రి లోకేష్ చర్చించారు.
సుమారు 25 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఏడు అంతస్తుల్లో నిర్మితమైన ఈ మ్యూజియం, సోవియట్ యుగం అణు ప్రాజెక్టుల ప్రారంభ దశల నుంచి ఆధునిక అణుశక్తి సాంకేతికత, భవిష్యత్తు శాస్త్రీయ అవకాశాల వరకు సమగ్ర సమాచారాన్ని అందిస్తోంది. అణుశక్తి రంగ అభివృద్ధిని అత్యాధునిక సాంకేతికతతో ప్రజలకు చేరువ చేసే విధంగా ప్రదర్శనలను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు వివరించారు.
మ్యూజియంలో ఏర్పాటు చేసిన ఇంటరాక్టివ్ ప్రదర్శనలు, శాస్త్రీయ ప్రయోగశాలలు, ప్రత్యక్ష అవగాహన కార్యక్రమాలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. విజ్ఞానం, చరిత్ర, సాంకేతికతలను సమన్వయం చేస్తూ రూపొందించిన ఈ కేంద్రం విద్యార్థులు, పరిశోధకులు, సాధారణ ప్రజలకు విలువైన విజ్ఞాన వేదికగా నిలుస్తోంది.
2023 నవంబర్‌లో ప్రారంభమైన ఈ మ్యూజియం ఇప్పటికే విశేష ప్రజాదరణ పొందిందని నిర్వాహకులు వెల్లడించారు. ఇప్పటివరకు ప్రపంచంలోని 80కి పైగా దేశాలకు చెందిన 35 లక్షల మందికిపైగా సందర్శకులు ఈ కేంద్రాన్ని వీక్షించినట్లు తెలిపారు. ఒకేసారి 2,100 మందికి పైగా సందర్శకులను ఆతిథ్యం ఇచ్చే సామర్థ్యం మ్యూజియానికి ఉందని వివరించారు.
మాస్కో ప్రభుత్వం, రష్యా ప్రభుత్వ అణుశక్తి సంస్థ రోసాటమ్ (Rosatom) సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఈ మ్యూజియం అణుశక్తి చరిత్రను మాత్రమే కాకుండా, శాంతియుత అవసరాల కోసం అణుశక్తి వినియోగం ద్వారా సాధించిన విజయాలను కూడా సమగ్రంగా పరిచయం చేస్తోంది.
పర్యటన సందర్భంగా అణుశక్తి రంగంలో రష్యా సాధించిన పురోగతి, ప్రజలకు శాస్త్రీయ అవగాహన కల్పించేందుకు చేపడుతున్న కార్యక్రమాలపై మంత్రి లోకేష్ ఆసక్తిగా వివరాలు తెలుసుకున్నారు. విజ్ఞానం, సాంకేతికతలను ప్రజలకు చేరువ చేసే ఇలాంటి మ్యూజియాలు యువతలో పరిశోధనా దృక్పథాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని అభిప్రాయపడ్డారు.