గోపీచంద్ వారసత్వం.. కూతురి భుజాన అర్జున ధనుస్సు!
పుల్లెల గాయత్రి గోపీచంద్‌కు అర్జున అవార్డు
హైదరాబాద్: బ్యాడ్మింటన్‌లో దేశానికి ఎన్నో పతకాలు అందించిన కోచ్ పుల్లెల గోపీచంద్ కుమార్తె, తెలంగాణ షట్లర్ పుల్లెల గాయత్రి గోపీచంద్‌కు కేంద్ర ప్రభుత్వం అరుదైన గౌరవం దక్కింది. 2025 సంవత్సరానికి గాను ప్రకటించిన జాతీయ క్రీడా పురస్కారాల్లో భాగంగా ఆమెకు అర్జున అవార్డు లభించింది. మంగళవారం కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఈ జాబితాను విడుదల చేసింది. మొత్తం 17 మంది క్రీడాకారులకు అర్జున అవార్డులు ప్రకటించగా, అందులో గాయత్రితో పాటు ఆమె డబుల్స్ భాగస్వామి త్రిసా జాలీ కూడా చోటు దక్కించుకోవడం విశేషం. మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అరుణ్ కుమార్ మిశ్రా నేతృత్వంలోని ఎంపిక కమిటీ సిఫారసుల మేరకు ఈ పురస్కారాలు ఖరారయ్యాయి.
క్రీడా కుటుంబం నుంచి..
హైదరాబాద్‌కు చెందిన గాయత్రి గోపీచంద్ పుల్లెల (23), దిగ్గజ షట్లర్, జాతీయ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్, మాజీ షట్లర్ పి.వి.వి.లక్ష్మి దంపతుల కుమార్తె. తండ్రి నిర్వహించే గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలోనే ఆటలో ఓనమాలు దిద్దుకున్న గాయత్రి, పన్నెండేళ్ల వయసులోనే జాతీయ జట్టుకు ఎంపికై అతి పిన్న వయస్కురాలిగా రికార్డు సృష్టించారు.
మహిళల డబుల్స్‌లో సత్తా
త్రిసా జాలీతో కలిసి మహిళల డబుల్స్ విభాగంలో గాయత్రి దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ జోడీ 2025 జనవరిలో ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 9వ స్థానానికి చేరింది. 2019 దక్షిణాసియా క్రీడల్లో టీమ్ ఈవెంట్‌లో స్వర్ణం, డబుల్స్‌లో రజతం సాధించిన గాయత్రి-త్రిసా జోడీ, 2022 కామన్వెల్త్ గేమ్స్‌లో మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో రజతం, డబుల్స్‌లో కాంస్యం గెలుచుకుంది. తండ్రి గోపీచంద్ 2001లో ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ టైటిల్ సాధించిన రెండు దశాబ్దాల తర్వాత, ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ సెమీఫైనల్‌కు చేరిన తొలి భారత మహిళల డబుల్స్ జోడీగా గాయత్రి-త్రిసా చరిత్ర సృష్టించారు. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్‌లోనూ ఈ జోడీ భారత్‌కు ప్రాతినిధ్యం వహించింది.
తండ్రి బాటలోనే..
తండ్రి పుల్లెల గోపీచంద్‌కు 1999లో అర్జున అవార్డు, 2001లో రాజీవ్‌గాంధీ ఖేల్‌రత్న, 2009లో ద్రోణాచార్య అవార్డు, 2014లో పద్మభూషణ్ పురస్కారాలు లభించాయి. ఇప్పుడు కుమార్తె గాయత్రి కూడా అర్జున అవార్డుతో ఆ వారసత్వాన్ని కొనసాగించడం విశేషం. ఈసారి జాతీయ క్రీడా పురస్కారాల్లో అత్యున్నత ఖేల్‌రత్న పురస్కారానికి ఏ క్రీడాకారుడూ ఎంపిక కాకపోవడం గమనార్హం. మాజీ ఫుట్‌బాల్ క్రీడాకారుడు ఐ.అరుమైనాయగంకు జీవితకాల అర్జున పురస్కారం ప్రకటించారు.