రుణమాఫీపై విమర్శించే నైతిక హక్కు బీఆర్ఎస్‌కు లేదు
మంత్రి తుమ్మల
- పదేళ్ల పాలనలో లక్ష రుణమాఫీనే సరిగా చేయలేని వారు ఇప్పుడు మాట్లాడటం విడ్డూరం
- దేశంలోనే తొలిసారి ఒకే పంటకాలంలో 2 లక్షల రుణమాఫీ చేసిన ఘనత మా ప్రభుత్వానిదే
హైదరాబాద్, ఆగస్టు 17:
రుణమాఫీ అంశంపై బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న విమర్శలను వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్రంగా తిప్పికొట్టారు. చిన్న వయస్సున్న తెలంగాణ రాష్ట్రం సాహసోపేతమైన నిర్ణయాలతో పెద్ద రాష్ట్రాలకే ఆదర్శంగా నిలుస్తోందని, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న తమ ప్రభుత్వం రైతుల పక్షపాతిగా, ఇచ్చిన మాటకు కట్టుబడి వ్యవహరిస్తోందని స్పష్టం చేశారు.
గత పాలకుల అనాలోచిత నిర్ణయాలతో ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉన్నప్పటికీ, ఎన్నికల హామీని నిలబెట్టుకుంటూ అధికారంలోకి వచ్చిన తొలి పంటకాలంలోనే 2 లక్షల లోపు పంట రుణాలన్నింటినీ మాఫీ చేసి దేశవ్యాప్త ప్రశంసలు అందుకున్నామని మంత్రి తెలిపారు. ఈ నిర్ణయం దేశంలోనే ఒక మైలురాయిగా, ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా నిలిచిందని, దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణ రైతుల పంట రుణ బాకీలు అత్యల్పంగా ఉన్నట్లు కేంద్రం పార్లమెంట్‌లో సమర్పించిన నివేదికే స్పష్టం చేసిందని పేర్కొన్నారు.
బీఆర్ఎస్ పదేళ్ల పాలనపై ఆరోపణలు
2014లో మిగులు బడ్జెట్‌తో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం, ఇచ్చిన లక్ష రూపాయల రుణమాఫీని ఒకేసారి చేయలేక నాలుగేళ్లపాటు వాయిదాల పద్ధతిలో అమలు చేసిందని, దీనివల్ల రైతులపై రూ.2,630 కోట్ల వడ్డీ భారం పడిందని మంత్రి తుమ్మల ఆరోపించారు. 2018లో మరోసారి అధికారంలోకి వచ్చాక లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పి, చివరి సంవత్సరంలో సగం మందికే అమలు చేయడం ద్వారా రైతులపై రూ.8,515 కోట్ల వడ్డీ భారం మోపారని, రూ.8,379 కోట్లు పూర్తిగా ఎగవేశారని, ఖాతాల్లో లోపాల కారణంగా రూ.1,419 కోట్లు వెనక్కి వెళ్లిపోయాయని వివరించారు. అధికారంలో ఉన్నప్పుడు రైతులను నిర్లక్ష్యం చేసిన నేతలు ఇప్పుడు కపట ప్రేమ ప్రదర్శిస్తున్నారని విమర్శించారు.
పారదర్శకంగా రుణమాఫీ అమలు
రుణమాఫీ అమలులో పారదర్శకత కోసం బ్యాంకర్లతో సమావేశాలు నిర్వహించి 2 లక్షల లోపు ఖాతాల వివరాలు సేకరించినట్లు మంత్రి తెలిపారు. 40 బ్యాంకుల నుంచి 42.30 లక్షల ఖాతాలు, 31.07 లక్షల కుటుంబాల వివరాలు రాగా, అందులో 2 లక్షల లోపు (అసలు, వడ్డీ కలిపి) ఉన్న 25,35,964 పంట రుణ ఖాతాలకు సంబంధించి రూ.20,616.89 కోట్లు చెల్లించినట్లు వివరించారు. కొన్ని ఖాతాల్లో లోపాలుంటే వాటిని సరిచేసేందుకు అధికారులు గ్రామాల వారీగా రెండు నెలలపాటు ఇంటింటికీ వెళ్లి ఆధార్ అనుసంధానం చేసి, మిగిలిన అర్హులైన రైతులకు నాలుగో విడతలో ప్రయోజనం అందేలా కృషి చేశారని పేర్కొన్నారు.
పంట రుణాలు, దీర్ఘకాలిక రుణాలు వేర్వేరని, తమ ప్రభుత్వం మాఫీ చేసింది 2 లక్షల లోపు పంట రుణాలు మాత్రమేనని స్పష్టం చేస్తూ, ఈ విషయాన్ని దాచిపెట్టి బీఆర్ఎస్ నేతలు రైతులను తప్పుదోవ పట్టించే యత్నం చేస్తున్నారని మండిపడ్డారు. అసెంబ్లీలో సాక్షిగా రుణమాఫీ లెక్కలు, నియోజకవర్గాలు, గ్రామాల వారీగా లబ్ధిదారుల వివరాలు సమర్పించినా, పదేపదే అబద్ధాలు ప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు. గత చరిత్రను గుర్తు చేసుకుని మాట్లాడితేనే బీఆర్ఎస్ నేతలకు హుందాతనం అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు.