అర్జున అవార్డుకు ఎంపికైన పుల్లెల గాయత్రికి
మాజీ మంత్రి పువ్వాడ అభినందనలు
ఖమ్మం, ఆగస్టు 18: అర్జున అవార్డుకు ఎంపికైన ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పుల్లెల గాయత్రికి మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అభినందనలు తెలిపారు. పిన్న వయసులోనే బ్యాడ్మింటన్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తూ ప్రతిష్ఠాత్మక అర్జున అవార్డుకు ఎంపిక కావడం అభినందనీయమన్నారు.
పుల్లెల గాయత్రి సాధించిన ఈ ఘనత యువ క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలుస్తుందని పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. వరుస విజయాలతో దూసుకెళ్తున్న గాయత్రి అంచెలంచెలుగా ఎదుగుతూ, తన తండ్రి, బ్యాడ్మింటన్ దిగ్గజం పుల్లెల గోపీచంద్‌కు తగ్గట్లుగా రాణిస్తున్నారని కొనియాడారు.
భవిష్యత్తులో గాయత్రి మరిన్ని విజయాలు సాధించి దేశానికి, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.