*గుంటూరు ఛానల్ రైతులకు ఎమ్మెల్యే"ఏలూరి"భరోసా*
దీక్ష విరమించిన రైతులు
•ఛానల్ ను పూర్తి చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం కృషి
•గుంటూరు ఛానల్ పూర్తి చేసే బాధ్యత కూటమి ప్రభుత్వానిదే
•భూ సేకరణ గెజిట్ నోటిఫికేషన్ కు రెవిన్యూ మంత్రి అనగాని ఆదేశాలు
•అపోహలకు తావులేదు..10 రోజుల్లో భూసేకరణకు గెజిట్ నోటిఫికేషన్
•రాజమోహన్‌కు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేసిన ఎమ్మెల్యే ఏలూరి
పర్చూరు:
గుంటూరు ఛానల్.. ఏళ్లుగా రైతులు ఎదురుచూస్తున్న ఈ ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేయించి రైతుల కలను సాకారం చేస్తామని, సీఎం చంద్రబాబు ప్రభుత్వం రైతన్నం కోసం పనిచేస్తుందని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు స్పష్టం చేశారు. గుంటూరు ఛానల్ విషయంలో ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉందని ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత కూటమి ప్రభుత్వాన్నిదేనని స్పష్టం చేశారు. సీసీఎల్ఏ నుంచి ఫైలు ప్రభుత్వానికి వెళ్లిందని ప్రభుత్వం ఈ అంశంలో స్పష్టతతో ఉందన్నారు. రెవెన్యూ మంత్రి అనగాని సత్య ప్రసాద్ గుంటూరు ఛానల్ భూసేకరణ గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చేలా సీసీఎల్ఏ(చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్) జయలక్ష్మి, సీసీఎల్ఏ జాయింట్ కమిషనర్ చేతన్, రెవెన్యూ శాఖ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారని ఎమ్మెల్యే ఏలూరి పేర్కొన్నారు.భూసేకరణ నోటిఫికేషన్ 10 రోజుల్లో వచ్చేలా కృషి చేస్తానని’’ అని రైతులకు భరోసా ఇచ్చారు. ప్రభుత్వంలో జరుగుతున్న క్రమాన్ని వివరించేందుకే స్పష్టతతో వచ్చానని ఎమ్మెల్యే ఏలూరి పేర్కొన్నారు. గుంటూరు ఛానల్ ను పర్చూరు వరకు తీసుకువచ్చి తాగునీరు శాశ్వత పరిష్కారం చూపుతామని ఎమ్మెల్యే ఏలూరి స్పష్టం చేశారు. గుంటూరు ఛానల్ గుంటూరు ఛానల్ కోసం దీక్ష చేస్తున్న నల్లమడ రైతు సంఘం అధ్యక్షుడు రాజమోహన్‌కు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు.
రైతాంగ ప్రయోజనాల విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని ఎమ్మెల్యే ఏలూరి తెలిపారు. ప్రాజెక్టు విషయంలో గుంటూరు ఛానల్ పనులను పూర్తి చేసి ఈ ప్రాంత రైతులకు సాగునీరు అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు.
గుంటూరు ఛానల్ నిర్మాణం సుమారు 25 కిలోమీటర్ల మేర ఉంటుందని ఎమ్మెల్యే ఏలూరి వివరించారు. ఇందులో దాదాపు 20 కిలోమీటర్లు గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గ పరిధిలో, మరో ఐదు కిలోమీటర్లు పర్చూరు నియోజకవర్గ పరిధిలో ఉన్నాయన్నారు. ప్రాజెక్టును రెండు భాగాలుగా విభజించి పనులు చేపట్టే విధంగా ప్రక్రియ కొనసాగుతోందన్నారు.
సుమారు ఏడేళ్ల తర్వాత కూడా గతంలో నిర్ణయించిన ధరలకే పనులు చేసేందుకు కాంట్రాక్టర్ ముందుకు రావడం ప్రాజెక్టుకు కలిసొచ్చే అంశమన్నారు. మళ్లీ రీటెండర్ నిర్వహిస్తే కనీసం ఏడాది సమయం వృథా అయ్యే అవకాశం ఉందని, అందువల్ల అదే కాంట్రాక్టర్‌తో పనులు కొనసాగించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఎమ్మెల్యే ఏలూరి చెప్పారు.
గత ప్రభుత్వ హయాంలో ఒక్క అడుగూ పడలేదు..
తెలుగుదేశం ప్రభుత్వ హయాం 2018లో గుంటూరు ఛానల్‌కు సంబంధించిన ప్రక్రియ దాదాపు పూర్తయిందని ఎమ్మెల్యే ఏలూరి తెలిపారు. అయితే అనంతరం అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం టెండర్లను రద్దు చేసి రివర్స్ టెండరింగ్ పేరుతో ప్రాజెక్టును నిలిపివేసిందని పేర్కొన్నారు. ఐదేళ్ల కాలంలో ప్రాజెక్టులో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదన్నారు. మధ్యలో ఐదేళ్లు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. గత ప్రభుత్వం ప్రాజెక్టును పట్టించుకోలేదని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్లలో గుంటూరు ఛానల్‌ను తిరిగి గాడిలో పెట్టేందుకు అనేక చర్యలు చేపట్టిందన్నారు. ప్రభుత్వం వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. గత రెండు ఏళ్లుగా ప్రభుత్వం గుంటూరు ఛానల్ను ట్రాక్ లో పెట్టేందుకు నిరంతరం పని చేస్తుందన్నారు.
11 గ్రామాల్లో 400 ఎకరాల భూసేకరణ...
గుంటూరు జిల్లా పరిధిలోని 11 గ్రామాల్లో సుమారు 400 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉందన్నారు. ఇప్పటికే నాలుగు గ్రామాలకు సంబంధించిన భూమిని కాంట్రాక్టర్‌కు అప్పగించామని, మిగిలిన ఏడు గ్రామాల్లో భూసేకరణ ప్రక్రియ పూర్తయిందని తెలిపారు. పర్చూరు నియోజకవర్గంలో రెండు గ్రామాల్లో అలైన్‌మెంట్ మార్పు చేయాల్సి రావడంతో ఇనగల్లులోనూ కొంత మార్పు జరిగి స్వల్ప జాప్యం చోటుచేసుకుందన్నారు.
పర్చూరు నియోజకవర్గ పరిధిలో సుమారు నాలుగున్నర కిలోమీటర్ల మేర కాలువ నిర్మాణానికి దాదాపు 51 ఎకరాల భూమి అవసరం కాగా, అందులో 49.6 ఎకరాల మేర భూసేకరణ చేయాల్సి ఉందని చెప్పారు.
నోటిఫికేషన్.. రైతులకు అభ్యంతరాల పరిష్కారానికి అవకాశం..
భూసేకరణకు సంబంధించిన ప్రతిపాదనలు కలెక్టర్ నుంచి సీసీఎల్‌ఏకు వెళ్తాయని, అక్కడ పరిశీలన అనంతరం ప్రభుత్వానికి పంపిస్తారని ఎమ్మెల్యే ఏలూరి వివరించారు. ప్రభుత్వం నుంచి జీవో వచ్చిన తర్వాత నోటిఫికేషన్ జారీ ప్రక్రియ పూర్తవుతుందన్నారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా కొన్ని చిన్నచిన్న అంశాలు పూర్తిగా లేకపోవడంతో ప్రతిపాదనలు మూడు, నాలుగు సార్లు వెనక్కి వచ్చినట్లు తెలిపారు. ప్రస్తుతం వాటిని సరిచేసి ప్రక్రియను ముందుకు తీసుకెళ్తున్నామన్నారు.2వ తేదీన రెవెన్యూ శాఖ సమీక్ష, అనంతరం 3 తేదీన మంత్రివర్గ సమావేశం ఉందని,ఈ ప్రక్రియను వేగవంతం చేసి పది రోజుల్లో భూ సేకరణకు గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చేలా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.
ప్రతి దశలో సమన్వయంతో పనులు...
మెయిన్ కెనాల్ నుంచి బ్రాంచ్ కెనాల్, అక్కడి నుంచి మేజర్ కాలువ, మైనర్ కాలువ, సబ్ మైనర్ కాలువల వరకు సర్వే, అలైన్‌మెంట్, భూసేకరణ ప్రక్రియలు ఒకదానితో ఒకటి సమన్వయం చేసుకుంటూ జరగాల్సి ఉంటుందని ఎమ్మెల్యే ఏలూరి రైతులకు వివరించారు. ఇంజినీరింగ్ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపిన తర్వాత అవసరమైన మార్పులు, నోటిఫికేషన్ల ప్రక్రియ కూడా క్రమపద్ధతిలో సాగుతుందన్నారు.
రైతుల సందేహాలకు సమాధానం...
గుంటూరు ఛానల్‌పై రైతుల్లో ఉన్న అనుమానాలు, అపోహలను తొలగించేందుకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే ఏలూరి తెలిపారు. మరో 10 నుంచి 15 రోజుల్లో ప్రాజెక్టుకు సంబంధించిన ఇంజినీరింగ్, రెవెన్యూ అధికారులతో పాటు ఈ ప్రాంత రైతులను ఒకే వేదికపైకి తీసుకొచ్చి సమావేశం ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నానన్నారు.
‘‘చాలామంది రైతులకు ప్రాజెక్టుపై సందేహాలు, అపోహలు ఉన్నాయి. ఏ భూమి వెళ్తుంది? ఎంత భూమి అవసరం? కాలువ ఎక్కడి నుంచి వెళ్తుంది? భూసేకరణ ఎలా జరుగుతుంది? పరిహారం ఎలా ఉంటుంది? వంటి అంశాలపై స్పష్టత రావాలి. అందుకే అధికారులతో రైతుల ముఖాముఖి సమావేశం ఏర్పాటు చేస్తాం. ప్రతి సందేహానికి సమాధానం ఇచ్చేలా చర్యలు తీసుకుంటాం’’ అని తెలిపారు.
‘‘మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా.. బాధ్యత నాదే’’
‘‘నేను మూడుసార్లు ఈ ప్రాంతానికి ఎమ్మెల్యేగా ఉన్నాను. ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవడం నా బాధ్యత. గత ప్రభుత్వంలో ప్రజలు నన్ను గెలిపించినా ప్రతిపక్షంలో ఉన్న తనకు ప్రభుత్వ సహకారం లేకపోవడంతో సమస్యను పరిష్కరించలేకపోయానని పేర్కొన్నారు. ఇప్పుడు అవకాశం వచ్చింది. ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోను. శక్తివంచన లేకుండా పనిచేస్తాను. గుంటూరు ఛానల్ ద్వారా త్రాగునీరు సాగునీరు అందేలా శాశ్వత పరిష్కారం చూపించడమే లక్ష్యంగా పని చేస్తానన్నారు. వెలిగొండ ప్రాజెక్టుతో పశ్చిమ ప్రకాశం ప్రజల మూడు దశాబ్దాల కలను ముఖ్యమంత్రి చంద్రబాబు సహకారంతో సాకారం చేయగలిగామని ఏలూరి గుర్తుచేశారు. అదే చిత్తశుద్ధితో గుంటూరు ఛానల్ సమస్యను కూడా పరిష్కరించే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు.రైతులది న్యాయమైన కోరిక వారి సాగునీటి అవసరాన్ని తీర్చడం ప్రభుత్వ బాధ్యత. రైతు సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఎలినినో ప్రభావం ఉన్న పట్టిసీమ ద్వారా చెరువులన్నీ నింపడం జరిగిందన్నారు.ఎన్ ఎస్ పి కాలువ ద్వారా 8 టీఎంసీల నీటితో చెరువులను నీటితో నింపుతున్నట్లు పేర్కొన్నారు.