సామాన్యులే పంచాయతీలకు పన్నులు కడుతున్నప్పుడు.. సంస్థలు ఎగవేస్తే ఎలా?
ఉద్దేశపూర్వకంగా పంచాయతీలకు పన్ను ఎగవేసే వారిని ఉపేక్షించం. పన్ను ఎగవేతల కారణంగా రాష్ట్ర ఆర్థిక మూలాలు దెబ్బతింటున్నాయి. పన్నులు సక్రమంగా చెల్లించి పంచాయతీల ఆర్థిక స్వావలంబనకు సహకరించాలి. పంచాయతీల పరిధిలో నిర్వహిస్తున్న సంస్థలపై సమగ్ర అధ్యయనం కోసం డీపీఓలతో ఎంపవర్డ్ కమిటీ ఏర్పాటు. పరిశ్రమలు, విద్యాసంస్థలు చెల్లిస్తున్న పన్నులపై రీ–అసెస్‌మెంట్ నిర్వహించాలి. పన్నులు సక్రమంగా వసూలు చేస్తే పంచాయతీల్లో సమస్యలు ఉండవు. పన్నుల వసూళ్లలో అవకతవకలను సహించం.
Venkat Kommineni··20 వీక్షణలు
‘పంచాయతీలు ఇచ్చే మౌలిక సదుపాయాలు, సౌకర్యాలు వినియోగించుకుంటున్న విద్యాసంస్థలు, పరిశ్రమలు పన్నులను బాధ్యతాయుతంగా చెల్లించాల’ని రాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. పంచాయతీల పరిధిలో ఉన్న పలు సంస్థలు ఉద్దేశపూర్వక పన్ను ఎగవేత చర్యలకు పాల్పడుతున్నాయని అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యాసంస్థలు, పరిశ్రమలు పన్నుల చెల్లింపు వ్యవహారంలో పారదర్శకత పాటిస్తే పంచాయతీలకు ఆర్థిక స్వావలంబన దక్కుతుందని తెలిపారు. పన్ను ఎగవేతల కారణంగా రాష్ట్ర ఆర్థిక మూలాలు దెబ్బతింటున్నాయన్నారు. పంచాయతీల్లో ఎన్ని విద్యాసంస్థలు ఉన్నాయి? ఎన్ని పరిశ్రమలు ఉన్నాయి? ఎంత వ్యర్థాలు ఉత్పత్తి చేస్తున్నాయి? ఎంత నీరు వాడుకుంటున్నాయి? ఏఏ సౌకర్యాలు వినియోగించుకుంటున్నాయి? ఎంత పన్ను చెల్లిస్తున్నాయి? అనే అంశాలపై అధ్యయనం జరిపేందుకు ఓ సాధికార కమిటీని ఏర్పాటు చేసి వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. సోమవారం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో పంచాయతీలకు పరిశ్రమలు, విద్యాసంస్థల పన్ను ఎగవేతపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులతో కీలక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అన్ని జిల్లాల పంచాయతీ అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. పంచాయతీల పరిధిలో నిర్వహిస్తున్న పరిశ్రమలు, విద్యా సంస్థలు, హ్యాచరీలు తదితర సంస్థల నుంచి పన్నుల వసూళ్లలో ఉన్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “ప్రయివేటు విద్యాసంస్థల్లో చదువుకునే విద్యార్థుల సంఖ్య పెరిగింది. విద్యార్థుల తల్లిదండ్రులు ఫీజులు కూడా పెద్ద ఎత్తున కడుతున్నారు. ఆ విద్యా సంస్థలు పంచాయతీల పరిధిలో ఉంటున్నాయి. పన్నులు సరిగా చెల్లించడం లేదు. విద్యాసంస్థలు, పరిశ్రమలు పంచాయతీలకు కడుతున్న పన్నులపై రీ అసెస్మెంట్ జరపాలి. నిర్మాణాల విలువ తగ్గించి చూపడం, ఉద్దేశపూర్వకంగా పన్నులు తక్కువ చూపడం చేస్తున్నారు. వేల మంది విద్యార్థులు ఉన్న విద్యాసంస్థలు సైతం పంచాయతీలు ఇచ్చే సౌకర్యాలు తీసుకుంటున్నాయి. పన్నులు మాత్రం కట్టడం లేదు. ఒక ప్రభుత్వ ఉద్యోగి తనకి వచ్చే జీతంలో సర్వీస్ టాక్స్ రూపంలో పన్ను కడుతున్నారు. దారిద్ర్య రేఖకు దిగువన ఉండి చేపల వేట మీద జీవనం సాగించే మత్స్యకారులు కూడా పన్నులు కడుతున్నారు. దిగువ మధ్య తరగతి వాళ్లు సైతం పన్నులు కడుతున్నప్పుడు విద్యాసంస్థలు, పరిశ్రమలు ఎందుకు సరిగా పన్నులు కట్టడం లేదు? పరిశ్రమలు, విద్యాసంస్థలు, హోటల్స్ ఎంత వ్యర్థాలు విడుదల చేస్తున్నాయి? ఎంత నీటిని వినియోగించుకుంటున్నాయి? పన్నులు చెల్లించేందుకు ఎందుకు ఇబ్బంది పడుతున్నాయి? ఎగవేతల వెనుక రాజకీయ ప్రమేయాలు ఏమైనా ఉన్నాయా? సబ్సిడీలు ఏమైనా ఇచ్చామా? అనే అంశాలపై నివేదికలు రూపొందించండి.
ఉద్యోగులు- ప్రజలకు, ప్రభుత్వానికి జవాబుదారీగా పని చేయాలి
ఆంధ్ర పేపర్ మిల్స్ లాంటి సంస్థలు కాలుష్యాన్ని గోదావరిలోకి వదిలేస్తూ, స్థానిక సంస్థలకి పన్నులు ఎగవేస్తున్నాయి. ఉద్యోగులు మీ పని మీరు చేయండి. ప్రజలకు, ప్రభుత్వానికీ మాత్రమే జవాబుదారీగా పని చేయాలి.
విద్యా సంస్థలు, హాస్టల్స్ లో సగటున ఒక విద్యార్థి రోజుకి 35 లీటర్ల నీరు వినియోగించారు అనుకుంటే ఎంత గ్రే వాటర్ వస్తుంది? చెత్త ఎంత వస్తుంది? అందుకు తగిన విధంగా పన్నులు చెల్లించే విధంగా చర్యలు తీసుకోండి. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదాయాన్ని సృష్టించాలని చెబుతున్నారు. ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నాం. అందుకు తగిన విధంగా ఆదాయం పెంచుకోవడం లేదు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేకపోతున్నాం. రూ. 10 వేలు సంపాదించే ఉద్యోగుల మీద భారం పెట్టి.. రూ. 100 కోట్లు సంపాదించే వారిని వదిలేస్తున్నాం.
పంచాయతీలకు రూ. 160 కోట్ల పన్ను బకాయిలు
గ్రామాల్లో తాగునీటి సరఫరా వ్యవస్థల్లో ఫిల్టర్ బెడ్ల మరమ్మతులకి డబ్బులు లేవని చెబుతున్నారు. రాష్ట్రం మొత్తం ఫిల్టర్ బెడ్ల మరమ్మతులకే రూ. 88 కోట్ల అవసరం ఉంది. ఒక్క ఆంధ్ర పేపర్ మిల్ సంస్థే రూ. 13 కోట్ల బకాయిలు కట్టాలి. పరిశ్రమలు కట్టకుండా వదిలేస్తున్న పన్ను సవ్యంగా చెల్లిస్తే రాష్ట్రంలో ఫిల్టర్ బెడ్ల సమస్యే ఉండదు. రాజకీయ ఒత్తిళ్లతో మనం పన్నులు వదిలేయడం వల్ల ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. పంచాయతీలు ఇబ్బంది పడుతున్నాయి. ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోంది. రాష్ట్రం మొత్తం మీద పరిశ్రమలు చెల్లించాల్సిన పన్ను బకాయిలు తక్కువలో తక్కువ రూ. 115.57 కోట్లు ఉన్నాయి. విద్యాసంస్థల నుంచి రూ. 45 కోట్లు రావాలి. ఈ రూ. 160 కోట్లలో సగం డబ్బు ఖర్చు చేస్తే రాష్ట్రం మొత్తం ఫిల్టర్ బెడ్లు బాగు చేయవచ్చు, నిర్వహణా ఖర్చులు వస్తాయి. నిజాయితీగా ఉండే కొంతమంది పారిశ్రామికవేత్తలు, ఉద్యోగులు మాత్రమే పన్నులు చెల్లిస్తున్నారు. మనం సరిగా పన్నులు వసూలు చేస్తే పంచాయతీలకు సుమారు రూ. 5,496 కోట్ల ఆదాయం వస్తుంది. ఇదంతా వసూలు చేయగలిగితే గ్రామాల్లో పారిశుధ్యపు సమస్యలు ఉండవు, సిబ్బందికి జీతాల సమస్యలు ఉండవు, వీధి లైట్ల సమస్య ఉండదు. పన్నుల చెల్లింపులపై రాష్ట్ర వ్యాప్తంగా పునః సమీక్ష చేయండి. పల్స్ సర్వే మాదిరి నాలుగు రోజుల డ్రైవ్ నిర్వహించండి. రాజకీయ ఒత్తిళ్లు ఉంటే మేము చూసుకుంటాం. పన్నులు ఎగవేస్తున్న వారి వివరాలు ప్రజలకి తెలియాలి.
చెట్టినాడ్ సిమెంట్స్ పన్ను వసూళ్లలో అవకతవకలపై తక్షణ చర్యలు
పంచాయతీలు బాగుపడాలి.. నాలుగు గ్రేడ్లకు డిఫరెంట్ స్లాబ్స్ తో టాక్సులు నిర్ధారించండి. విద్యాసంస్థలకు కూడా గ్రేడ్లు నిర్ణయించండి.. కరెంటు వాడేసుకుని బిల్లు కట్టమంటే కోర్టుకి ఎలా వెళ్తారు.. ఉచితంగా విద్యను అందిస్తూ ఇన్సెంటివ్స్ ఇవ్వమంటే అర్ధం ఉంటుంది.. లక్షలకి లక్షలు ఫీజులు తీసుకుని పన్ను కట్టకుండా ఉంటే ఎలా? ప్రజలకి ఏం సమాధానం చెబుతాం. వారిని వదిలేసి మమ్మల్ని పీడిస్తున్నారని ప్రజలు అంటే ప్రభుత్వానికి చెడ్డపేరు. గత 30 ఏళ్లలో పంచాయతీల ఆస్తులు ఎన్ని అన్యాక్రాంతం అయ్యాయనే అంశంపై కూడా సమగ్ర నివేదిక ఇవ్వండి. పన్ను చెల్లింపుల వ్యవహారంలో మినహాయింపులు ఇవ్వాల్సి ఉంటే వాటిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. పన్నుల వసూళ్లలో అవకతవకలు సహించం. తాళ్లపాలెం, చెట్టినాడ్ సిమెంట్స్ నుంచి పన్ను వసూలు చేయని పంచాయతీ కార్యదర్శిపై తక్షణం చర్యలు తీసుకోవాలి. పన్ను చెల్లింపుల్లో అవకతవకల్ని ఉపేక్షించవద్దు. పెద్ద పెద్ద పరిశ్రమల నుంచి పన్నులు వసూలు కాని జాబితా సిద్ధం చేసి, ఎందుకు వసూలు కావడం లేదు అనే వివరాలు సమర్పించండి.
పంచాయతీల స్వయం సమృద్ధి ప్రణాళికలు
పంచాయతీల్లో సొంత ఆదాయ వనరులు పెంచుకోవాలి. అందుకోసం కలప ఇచ్చే మొక్కలు ప్రతి పంచాయతీలో 2 వేలు నాటాలి. దీని కోసం పంచాయతీరాజ్, అటవీశాఖల మధ్య పరస్పర ఒప్పందం కుదిరింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు త్వరలో పంచాయతీలకు చేరతాయి. ఒక పంచాయతీ యూనిట్ గా ఏ విధమైన ఆదాయ వనరులు ఉంటాయి? ఆ పంచాయతీకి ఎన్ని రకాల ఆదాయాలు సమకూర్చాలి అనే అంశంపై కూడా జిల్లా పంచాయతీ అధికారులతో కూడిన సాధికార కమీ అధ్యయనం చేయాలి. బిల్ బోర్డులు, ఎంటర్ టైన్మెంట్ టాక్సులతోపాటు పంచాయతీలకు ఆదాయం పెంచేందుకు ఉన్న ప్రతి అవకాశాన్ని పరిశీలించాలి” అన్నారు. ఈ సమావేశంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ కాంతిలాల్ దండే, కమిషనర్ కృష్ణ తేజ, అన్ని జిల్లాల డీపీఓలు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.