సీఎం చంద్రబాబుకు ఉన్న నీటిసోయి రేవంత్‌రెడ్డికి లేదు
మాజీ మంత్రి పువ్వాడ
ఖమ్మం:
తెలంగాణ నీటిపారుదల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి తన గురువు సీఎం చంద్రబాబుకు ఉన్న సోయి లేదని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ విమర్శించారు. ఖమ్మం జిల్లాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాళేశ్వరం వద్ద నీళ్లు ఎత్తిపోయకుండా వదిలేస్తే, దిగువన ఉన్న ఏపీలో పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా ఆ నీటిని కృష్ణా డెల్టాకు తరలించి చంద్రబాబు తన రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసుకుంటున్నారని పేర్కొన్నారు.
చంద్రబాబుకు ఉన్న నీటి సోయిని అందిపుచ్చుకుని, ఎగువన ఉన్న తెలంగాణలో నీళ్లు ఎత్తిపోసి రైతులకు అందించాల్సిన బాధ్యత రేవంత్‌రెడ్డి ప్రభుత్వంపై ఉందని పువ్వాడ అన్నారు. కాళేశ్వరం జలాలను వినియోగించుకోలేకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమేనని ఆరోపించారు. తెలంగాణ ప్రజలు, రైతులకు నీటి విషయంలో అన్యాయం చేయవద్దని కోరారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌కు ఓట్లు వేసింది ఆంధ్రప్రదేశ్‌కు నీళ్లు ధారాదత్తం చేయడానికి కాదని ఆయన స్పష్టం చేశారు.