పోలవరం బ్యాక్‌వాటర్‌తోనే భద్రాచలం ముంపు తీవ్రత
మాజీ మంత్రి
గోదావరి వరద – ప్రభుత్వాల ఉదాసీనతపై పువ్వాడ ధ్వజం
భద్రాచలం, ఆగస్టు 1:
భద్రాచలం పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతం కనిపిస్తున్న గోదావరి వరద ఉద్ధృతికి సహజ కారణాలు మాత్రమే కాకుండా, దిగువన నిర్మాణంలో ఉన్న పోలవరం ప్రాజెక్టు బ్యాక్‌వాటర్ ప్రభావం కూడా ప్రధాన కారణమని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. శనివారం ఆయన విడుదల చేసిన ప్రకటనలో, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల భద్రాచలం, పరిసర గ్రామాల్లో ముంపు సమస్య మరింత తీవ్రమైందని, వరదలు వచ్చిన ప్రతిసారి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శాశ్వత పరిష్కారం చూపడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు.
మంత్రిగా నిరంతరం పోరాటం చేశా: పువ్వాడ
పోలవరం ముంపు సమస్యపై తాను మంత్రిగా బీఆర్ఎస్ పార్టీ తరఫున తొలి నుంచి నిరంతరం పోరాడానని పువ్వాడ అజయ్ కుమార్ గుర్తుచేసుకున్నారు. గతంలో పలు వేదికలపై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి, తెలంగాణ ప్రజల పక్షాన బలంగా గళం వినిపించానని తెలిపారు. భద్రాచలం ప్రాంత ప్రజల ప్రయోజనాల పరిరక్షణలో బీఆర్ఎస్ ఎప్పటికీ రాజీపడదని స్పష్టం చేశారు.
శాశ్వత పరిష్కారం చూపాలి: డిమాండ్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పరం బాధ్యతలు నెట్టేసుకునే ధోరణిని విడనాడాలని, పోలవరం బ్యాక్‌వాటర్ ప్రభావంపై సమగ్ర అధ్యయనం నిర్వహించి భద్రాచలం పరిసర ప్రాంతాలకు శాశ్వత ముంపు నివారణ చర్యలు చేపట్టాలని పువ్వాడ డిమాండ్ చేశారు. వరదల సమయంలో తాత్కాలిక సహాయక చర్యలకే పరిమితం కాకుండా, భవిష్యత్తులో ముంపు సమస్య పునరావృతం కాకుండా శాశ్వత కార్యాచరణ ప్రణాళికను రూపొందించి అమలు చేయాలని కోరారు.