బాహుబలి శైలిలో సీఎం రేవంత్ రెడ్డి..
భుజాన గణనాథుడు
‘తెలంగాణ రైజింగ్–1000 డేస్’ థీమ్‌తో ప్రత్యేక గణపతి మండపం
సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను ప్రతిబింబించేలా వినూత్న ఏర్పాటు
హైదరాబాద్, సెప్టెంబర్ 14:
వినాయక చవితి సందర్భంగా హైదరాబాద్ గోషామహల్ నియోజకవర్గం అగాపురాలో ఏర్పాటు చేసిన ప్రత్యేక గణపతి మండపం భక్తులను, ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటోంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రతిబింబించేలా ‘తెలంగాణ రైజింగ్–1000 డేస్ యాజ్ సీఎం’ థీమ్‌తో ఈ మండపాన్ని తీర్చిదిద్దారు.
తెలంగాణ ఫిషర్‌మెన్ కాంగ్రెస్ చైర్మన్ మెట్టు సాయికుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ మండపంలో గణపతి ప్రతిమను వినూత్న రీతిలో రూపొందించారు. ‘బాహుబలి’ సినిమాలో శివలింగాన్ని భుజాన మోసే సన్నివేశాన్ని పోలిన విధంగా.. సీఎం రేవంత్‌రెడ్డి భుజంపై గణనాథుడిని ఎత్తుకున్నట్లుగా ప్రతిమను తయారు చేశారు. తెల్ల చొక్కా, నల్ల ప్యాంటు, ఆకుపచ్చ కండువాతో రూపొందించిన రేవంత్‌రెడ్డి ప్రతిమ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
సంక్షేమ పథకాల ప్రదర్శన
గణపతి ప్రతిమతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేసేలా మండపం చుట్టూ ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేశారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా, ఉచిత వ్యవసాయ విద్యుత్, పంట నష్టపరిహారం తదితర రైతు సంక్షేమ కార్యక్రమాల వివరాలను ప్రదర్శించారు.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కే గ్యాస్ సిలిండర్, గృహజ్యోతి కింద ఉచిత విద్యుత్ వంటి పథకాల వివరాలను ఫ్లెక్సీల ద్వారా పొందుపరిచారు. ఇందిరమ్మ ఇళ్లు, చేయూత పింఛన్లు, సన్నబియ్యం పంపిణీ, యువతకు ఉద్యోగ నియామకాలు, విద్యా భరోసా కార్డులు, రాజీవ్ ఆరోగ్యశ్రీ తదితర కార్యక్రమాలకు సంబంధించిన వివరాలను కూడా మండపంలో ఏర్పాటు చేశారు.
అభివృద్ధి కార్యక్రమాలకూ చోటు
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రీజినల్ రింగ్ రోడ్డు, మూసీ నది పునరుజ్జీవన ప్రణాళిక వంటి కీలక మౌలిక వసతుల అభివృద్ధి కార్యక్రమాలను కూడా ప్రదర్శనలో చేర్చారు. వెయ్యి రోజుల ప్రజాపాలనలో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ఒకే వేదికపై ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
గణనాథుడిని దర్శించుకునేందుకు వస్తున్న భక్తులు ప్రత్యేక ప్రతిమను ఆసక్తిగా తిలకించడంతో పాటు మండపంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల వివరాలను పరిశీలిస్తున్నారు. దీంతో అగాపురాలోని ఈ వినూత్న గణపతి మండపం స్థానికంగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.