*బతుకుపోరులో బిడ్డ ఊపిరి కోసం అల్లాడిన.*
అమ్మానాన్న
1 / 2
•కంటి"పాపకు"ఆసరాగా నిలిచిన"సాంబన్న"హస్తం
•సీఎంఆర్ ద్వారా రూ.3,54,127 భరోసా
•వినూత్న కార్యక్రమానికి ఎమ్మెల్యే ఏలూరి శ్రీకారం
•బాధితుల ఇంటి వద్దకే ఎల్ఓసి చెక్కులు
•నేతలకు ఎమ్మెల్యే ఏలూరి కీలక ఆదేశాలు
పర్చూరు:
కూలి పని చేస్తేనే పూట గడిచే ఇల్లు.. కడుపు నింపుకోవడమే కష్టమైన బతుకులో కొత్త ప్రాణం పురుడు పోసుకుంది. కానీ ఆ చిట్టితల్లి బరువు తక్కువగా పుట్టడంతో, పురిటి నొప్పుల కంటే ముందు తల్లిదండ్రుల గుండెల్లో మరో యుద్ధం మొదలైంది. బిడ్డను బతికించుకోవాలంటే వైద్యం కావాలి.. వైద్యం కావాలంటే డబ్బు కావాలి.. కానీ రోజు కూలీయే జీవనాధారమైన ఆ నిరుపేద దంపతులకు అంత మొత్తం ఎక్కడి నుంచి తేవాలో అర్థం కాలేదు. కళ్లెదుటే బిడ్డ ప్రాణం గాల్లో దీపంలా ఊగిసలాడుతుంటే, ఆ అమ్మానాన్న కళ్లలో నీళ్లు తప్ప దారే కనిపించలేదు. చివరకు వారి ఆవేదనను తెలుసుకున్న ఎమ్మెల్యే ఏలూరి స్థానిక నేతల ద్వారా సీఎంఆర్ఎఫ్ మంజూరుకు ముఖ్యమంత్రి కార్యాలయానికి లేఖ రాశారు. తక్షణమే తన క్యాంపు కార్యాలయం నుంచి ప్రతినిధులను సీఎం ఓకి పంపారు. ఆగమేఘాల మీద ఎల్ఓసి మంజూరి చేయించి ఎమ్మెల్యే ఏలూరి ఆ కుటుంబానికి ఆపద్బాంధవుడిలా అండగా నిలిచి, ఆ చిన్నారి ప్రాణాలకు భరోసా ఇచ్చారు.
బతుకుపోరులో బిడ్డ కోసం పోరాటం
పర్చూరు మండలం, పర్చూరు గ్రామానికి చెందిన షేక్ మస్తాన్ వలి-షేక్ నన్నే దంపతులు రోజువారీ కూలి పనులు చేసుకుంటూ నెట్టుకొస్తున్న నిరుపేద కుటుంబం. వారం రోజుల క్రితం వీరికి ఆడ శిశువు జన్మించింది. ఆ కుటుంబంలో పాప జన్మించడంతో సంతోషం వెల్లివిరియాల్సిన వేళ, పాప తక్కువ బరువుతో పుట్టడంతో ఆ ఆనందం ఆందోళనగా మారింది. చిన్నారికి తక్షణమే ఇంక్యుబేటర్‌లో ఉంచి ప్రత్యేక చికిత్స అందించాలని వైద్యులు స్పష్టం చేశారు. అప్పటికే రోజు కూలిపైనే ఆధారపడి బతుకుతున్న మస్తాన్ వలికి, లక్షల్లో అయ్యే చికిత్స ఖర్చు తలచుకుంటేనే గుండె జారిపోయింది.
దిక్కుతోచని వేళ.. ఆసరాగా ఎమ్మెల్యే
ఎటు తిరిగినా దారి కనిపించని స్థితిలో, ఆ దంపతులు తమ గోడు వెళ్లబోసుకునేందుకు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు వద్దకు చేరుకున్నారు. బాధిత తల్లిదండ్రుల కళ్లలో కదలాడిన ఆవేదనను గమనించిన ఎమ్మెల్యే, వెంటనే విషయం ఆరా తీసి వైద్యులతో మాట్లాడారు. ఏమాత్రం జాప్యం చేయకుండా తన క్యాంపు కార్యాలయ సిబ్బందిని ఆదేశించి, ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా ఎల్‌ఓసీ మంజూరు అయ్యేలా చర్యలు చేపట్టారు.
రూ.3,54,127తో ప్రాణాలకు భరోసా
ఎమ్మెల్యే ఏలూరి చొరవతో ముఖ్యమంత్రి కార్యాలయం (CMO) నుంచి చిలకలూరిపేటలోని వరలక్ష్మి ఫెర్టిలిటీ అండ్ మెటర్నిటీ హాస్పిటల్‌లో చిన్నారి చికిత్స నిమిత్తం రూ.3,54,127 (మూడు లక్షల యాభై నాలుగు వేల నూట ఇరవై ఏడు రూపాయలు) మేర ఎల్‌ఓసీ మంజూరైంది.
ఇంటివద్దకే చెక్కుతో వచ్చి ధైర్యం చెప్పిన నేతలు
ఎమ్మెల్యే ఆదేశాల మేరకు స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు నేరుగా బాధితుని ఇంటికి చేరుకుని చెక్కును అందజేశారు. లక్షల్లో వచ్చిన ఆ సాయాన్ని చూసి కంటతడి పెట్టిన మస్తాన్ వలి దంపతులు, ఎమ్మెల్యే ఏలూరికి కృతజ్ఞతలు తెలిపారు. తమ చిన్నారికి ఇక సరైన వైద్యం అందుతుందన్న ధీమా వారి మోముల్లో ప్రస్ఫుటంగా కనిపించింది. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు కొల్లా శ్రీనివాసరావు, మైనారిటీ వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ షంషుద్దీన్, ప్రధాన కార్యదర్శి నరేంద్ర, పర్చూరు పట్టణ అధ్యక్షుడు ఆకుల శ్రీనివాసరావు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.