*పేదల ఆరోగ్యానికి చంద్రన్న భరోసా*
ఎమ్మెల్యే ఏలూరి
•131 మందికి రూ.56.48 లక్షల సీఎం సహాయనిధి చెక్కులు అందజేత
•24 నెలల్లో 3,500 కుటుంబాలకు రూ.21 కోట్లకు పైగా సాయం
•సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో ఎమ్మెల్యే ఏలూరి
పర్చూరు:
ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్‌ఎఫ్) అండగా నిలుస్తోందని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్నారు. పేదల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మానవతా దృక్పథంతో వైద్య ఖర్చులకు సీఎంఆర్‌ఎఫ్ ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నారని పేర్కొన్నారు. శుక్రవారం 131 మందికి రూ.56,48,356 విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను స్టేట్ మైనారిటీ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ మహమ్మద్ ముస్తాక్ అహ్మద్ తో కలిసి ఎమ్మెల్యే ఏలూరి అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రాణం ఎంతో విలువైనదని, కుటుంబ సభ్యుడిని కాపాడుకునేందుకు ఎంతటి కష్టాన్నైనా భరించేందుకు ప్రతి ఒక్కరూ సిద్ధపడతారని అన్నారు. అదే విధంగా కష్టకాలంలో ఉన్న కుటుంబాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సభ్యుడిలా అండగా నిలిచి సీఎంఆర్‌ఎఫ్ ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నారని తెలిపారు.
24 నెలల్లో రూ.21 కోట్లకు పైగా సాయం..
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 24 నెలల్లో పర్చూరు నియోజకవర్గంలో సుమారు 3,500 కుటుంబాలకు రూ.21 కోట్లకు పైగా సీఎంఆర్‌ఎఫ్ ద్వారా అందించామని ఏలూరి తెలిపారు. 2014–19 మధ్య కాలంలో సుమారు రూ.12 కోట్ల సీఎంఆర్‌ఎఫ్ నిధులు అందించగా.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు రూ.21 కోట్లకు పైగా అందించామని వివరించారు.
రాజకీయాలకు అతీతంగా సాయం...
కష్టాల్లో ఉన్న రైతులు, కూలీలు, పేదలకు ఎలాంటి సిఫార్సులు, రాజకీయ ప్రమేయం లేకుండా సీఎంఆర్‌ఎఫ్ ద్వారా సాయం అందిస్తున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఓటు వేశారా? లేదా? ఏ పార్టీకి మద్దతు ఇచ్చారు? అనే అంశాలతో సంబంధం లేకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు, అభివృద్ధి ఫలాలు అందిస్తున్నామని చెప్పారు. ప్రతి ఒక్కరి ఆత్మగౌరవాన్ని కాపాడుతూ ప్రభుత్వం న్యాయం చేస్తోందన్నారు.
యూనివర్సల్ హెల్త్ స్కీమ్ దిశగా అడుగులు..
పేదల ఆరోగ్యానికి మరింత భరోసా కల్పించేందుకు యూనివర్సల్ హెల్త్ స్కీమ్ ఏర్పాటు దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు చర్యలు చేపడుతున్నారని ఏలూరి తెలిపారు. ఆర్థిక ఇబ్బందులతో ప్రభుత్వం నడిచే పరిస్థితుల్లోనూ పేదలకు అండగా నిలిచేందుకు ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. అస్తవ్యస్తంగా ఉన్న ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతూనే ప్రజలకు అవసరమైన సమయంలో సహాయం అందించాలనే సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.
ప్రభుత్వాన్ని నడిపే వ్యక్తికి ప్రజలకు మేలు చేయాలనే ఆలోచన ఉంటేనే సంక్షేమం సాధ్యమవుతుందని.. పేదలకు మేలు చేయాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నిరంతరం పనిచేస్తున్నారని ఎమ్మెల్యే ఏలూరి పేర్కొన్నారు.