మురసు తుఫాన్ పై సీఎం చంద్రబాబు సమీక్ష
సీఎం కీలక ఆదేశాలు
మురసు తుఫాన్ నేపథ్యంలో రాష్ట్రంలో చేపట్టిన ముందస్తు చర్యలు, క్షేత్రస్థాయి సన్నద్ధతపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (RTGS) కేంద్రం నుంచి అధికారులు, జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. దక్షిణ కోస్తాంధ్రతో పాటు దిగువ ప్రాంతాలు, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టుల పరిధిలో వర్షాలు కురిసి వరద ప్రవాహాలు వచ్చే అవకాశం ఉందని, సుమారు 13 నుంచి 15 టీఎంసీల నీరు చేరవచ్చని అంచనా వెల్లడించారు.
*విద్యుత్ శాఖ అప్రమత్తం*
అర్నబ్ తుఫాన్ కారణంగా శ్రీకాకుళం నుంచి కృష్ణా జిల్లా వరకు సుమారు 31 వేల విద్యుత్ స్తంభాలను క్షేత్రస్థాయికి తరలించినట్లు అధికారులు తెలిపారు. మురసు తుఫాన్ గాలుల ప్రభావంతో దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో సుమారు 8 వేల విద్యుత్ స్తంభాల వరకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని అంచనా వేశారు. అవసరమైన సామగ్రి, సిబ్బందితో విద్యుత్ శాఖ సిద్ధంగా ఉందని వివరించారు.
*నీటి నిర్వహణపై సీఎం ఆదేశాలు*
తుఫాన్ ప్రభావాన్ని సమర్థంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని చంద్రబాబు అధికారులకు సూచించారు. గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, మార్కాపురం తదితర ప్రాంతాల్లో సమర్థవంతమైన నీటి నిర్వహణ ద్వారా చెరువులను నింపాలని ఆదేశించారు. దక్షిణ కోస్తా, రాయలసీమ బేసిన్ పరిధిలోని వివిధ రిజర్వాయర్లలో నీటిని నిల్వ చేసుకునేలా చర్యలు చేపట్టాలని సూచించారు. అర్నబ్ తుఫాన్ వల్ల జరిగిన విధ్వంసం నుంచి అనేక ప్రాంతాలు ఇప్పటికే సాధారణ స్థితికి చేరుకుంటున్నాయని సీఎం పేర్కొన్నారు. గత తుఫాన్‌తో పోలిస్తే మురసు ప్రభావం తక్కువగా ఉండే అవకాశం ఉందని అధికారులు అంచనా వేసినప్పటికీ, ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. మురసు తుఫాన్‌ను సమర్థంగా ఎదుర్కొనేందుకు క్షేత్రస్థాయిలో యంత్రాంగం సిద్ధంగా ఉందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.