అంగన్‌వాడీ కేంద్రంలో చిన్నారులతో కలిసి రాగి జావ తాగిన
సీఎం చంద్రబాబు
చిలకలూరిపేట,జూన్ 20: పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలోని లింగంగుంట్ల గ్రామ అంగన్‌వాడీ కేంద్రాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శనివారం సందర్శించారు. స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర, అన్నదాత సుఖీభవ కార్యక్రమాల సందర్భంగా గ్రామానికి వచ్చిన ఆయన తొలుత అంగన్‌వాడీ కేంద్రానికి వెళ్లి అక్కడి కార్యకలాపాలను పరిశీలించారు.
నెట్‌జీరో విధానంలో భాగంగా రాష్ట్రంలోని 44,346 అంగన్‌వాడీ కేంద్రాలకు రూ.32 కోట్ల వ్యయంతో ఇండక్షన్ స్టవ్‌లు, స్టీల్ పాత్రలను ప్రభుత్వం పంపిణీ చేస్తున్న నేపథ్యంలో లింగంగుంట్ల అంగన్‌వాడీ కేంద్రానికి సీఎం స్వయంగా ఇండక్షన్ స్టవ్, స్టీల్ పాత్రలను అందజేశారు. అనంతరం కేంద్రంలో నిల్వ ఉంచిన ఆహార సరుకులు, పోషకాహార పంపిణీ వివరాలను అడిగి తెలుసుకున్నారు.
అంగన్‌వాడీ కేంద్రం ద్వారా చిన్నారులకు అందిస్తున్న పోషకాహారం, ప్రాథమిక విద్య, గర్భిణులు, బాలింతలకు అందిస్తున్న సేవలపై టీచర్, సిబ్బందిని ప్రశ్నించి వివరాలు తెలుసుకున్నారు. సీఎం సమక్షంలో అంగన్‌వాడీ సహాయకురాలు ఇండక్షన్ స్టవ్‌పై రాగి జావ తయారు చేయగా, చిన్నారులతో కలిసి నేలపై కూర్చుని సీఎం రాగి జావను తీసుకున్నారు. అనంతరం చిన్నారులతో ఆప్యాయంగా ముచ్చటించారు.
పచ్చదనం పెంపు కార్యక్రమంలో భాగంగా అంగన్‌వాడీ ప్రాంగణంలో సిబ్బందితో కలిసి మొక్కను నాటారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు, జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.