సమ్మక్క–సారక్క బ్యారేజ్‌కు మార్గం సుగమం
ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయితో మంత్రి ఉత్తమ్ భేటీ
హైదరాబాద్,జూన్ 12: గోదావరి నదిపై ప్రతిపాదిత సమ్మక్క–సారక్క బ్యారేజ్ (సమ్మక్క సాగర్) ప్రాజెక్టు అనుమతుల సాధనలో తెలంగాణ ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ప్రాజెక్టుకు అవసరమైన అభ్యంతర రహిత పత్రం (ఎన్ఓసీ) జారీ చేయాలని కోరుతూ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయితో హైదరాబాద్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ తరఫున అధికారిక విజ్ఞాపన పత్రాన్ని అందజేశారు.హైదరాబాద్‌లోని పార్క్ హయత్ హోటల్‌లో జరిగిన సమావేశంలో ఇరు రాష్ట్రాల అధికారులతో కలిసి ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలపై విస్తృతంగా చర్చించారు. తెలంగాణ విజ్ఞప్తిపై ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి అంశాన్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చినట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.
ఎన్ఓసీతో కీలక అడ్డంకి తొలగే అవకాశం
సమ్మక్క–సారక్క ప్రాజెక్టు డీపీఆర్‌కు కేంద్ర జల సంఘంలోని దాదాపు అన్ని విభాగాల నుంచి అనుమతులు లభించాయని, అంతర్‌రాష్ట్ర వ్యవహారాల డైరెక్టరేట్ అనుమతి మాత్రమే పెండింగ్‌లో ఉందని మంత్రి వెల్లడించారు. ఛత్తీస్‌గఢ్ నుంచి ఎన్ఓసీ లభించిన వెంటనే డీపీఆర్ తుది పరిశీలన పూర్తయ్యే అవకాశం ఉందన్నారు.
సర్వేకు రూ.9.88 కోట్లు
ప్రాజెక్టు ముంపు, బ్యాక్‌వాటర్ ప్రభావిత ప్రాంతాలపై ఇరు రాష్ట్రాల ఇంజినీర్లు ఇప్పటికే సంయుక్త సర్వే నిర్వహించారని తెలిపారు. మరింత ఖచ్చితమైన అధ్యయనం కోసం ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం కోరిన మేరకు తెలంగాణ ప్రభుత్వం సర్వే ఖర్చుల నిమిత్తం రూ.9.883 కోట్లు విడుదల చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం బీజాపూర్ జిల్లాలో సర్వే పనులు కొనసాగుతున్నాయని వివరించారు.ముంపు ప్రభావిత భూములు గుర్తించిన పక్షంలో చట్టబద్ధంగా పరిహారం చెల్లించేందుకు, అవసరమైతే ముందుగానే నిధులు డిపాజిట్ చేయడానికి కూడా తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.
4.40 లక్షల ఎకరాలకు ప్రయోజనం
సమ్మక్క–సారక్క బ్యారేజ్ ద్వారా గోదావరి నుంచి 46.96 టీఎంసీల నీటిని మళ్లించి, ఎస్సార్ఎస్పీ స్టేజ్–2 కింద 4.40 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించనున్నట్లు మంత్రి తెలిపారు. అదనంగా రామప్ప–పాకాల లింక్ కాలువ ద్వారా మరో 30 వేల ఎకరాలకు సాగునీటి సౌకర్యం కల్పించనున్నట్లు పేర్కొన్నారు.ఈ ప్రాజెక్టు వల్ల సూర్యాపేట, మహబూబాబాద్, ఖమ్మం, వరంగల్, జనగామ జిల్లాల్లోని లక్షల ఎకరాల వ్యవసాయ భూములకు ప్రయోజనం చేకూరనుంది. దేవాదుల ఎత్తిపోతల పథకంలోని కొంత ఆయకట్టు స్థిరీకరణకు కూడా ఇది దోహదపడుతుందని చెప్పారు. ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లోని వందల గ్రామాలకు తాగునీటి సౌకర్యం మెరుగుపడుతుందని వివరించారు.
రెండేళ్లుగా నిరంతర ప్రయత్నాలు
ప్రాజెక్టు అనుమతుల కోసం తెలంగాణ ప్రభుత్వం గత రెండేళ్లుగా నిరంతర కృషి చేస్తోందని మంత్రి తెలిపారు. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వానికి పలుమార్లు అధికారిక లేఖలు పంపడంతో పాటు, రాయ్‌పూర్‌లో ముఖ్యమంత్రిని కలిసి ఈ అంశంపై చర్చించినట్లు చెప్పారు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సి.ఆర్. పాటిల్, కేంద్ర జల సంఘం అధికారులతోనూ పలుమార్లు సమావేశమై అనుమతుల ప్రక్రియను వేగవంతం చేయాలని కోరినట్లు వెల్లడించారు.
త్వరలోనే అనుమతులపై స్పష్టత
ప్రస్తుతం సర్వే పనులు కొనసాగుతుండటం, అవసరమైన నిధులు విడుదల కావడం, ముంపు బాధితులకు పరిహారం చెల్లించేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందుకు రావడం, ఇరు రాష్ట్రాల మధ్య సానుకూల వాతావరణం నెలకొనడం వంటి పరిణామాలతో ఎన్ఓసీ త్వరలోనే లభించే అవకాశాలు మెరుగయ్యాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.
ఎన్ఓసీ జారీ అయిన వెంటనే కేంద్ర జల సంఘం తుది పరిశీలన పూర్తిచేసి ప్రాజెక్టు అమలుకు ఉన్న ప్రధాన పరిపాలనా అడ్డంకి తొలగిపోతుందని ఆయన పేర్కొన్నారు. రైతుల సాగునీటి భద్రత, తాగునీటి అవసరాలు, అంతర్‌రాష్ట్ర సత్సంబంధాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తోందని తెలిపారు.