రేపే రైతు భరోసా నిధుల జమ .. శిల్పకళావేదికలో కార్యక్రమం
మంత్రి తుమ్మల
హైదరాబాద్, జూన్ 29: రైతు భరోసా పెట్టుబడి సహాయ నిధులను నిర్ణీత షెడ్యూల్ ప్రకారం రేపు (30న) ప్రభుత్వం విడుదల చేయనుంది. ఈ నిధుల జమ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ శిల్పకళావేదిక నుండి అధికారికంగా లాంఛనంగా ప్రారంభించనున్నారు.
ఖమ్మం జిల్లా మధిరలో ఈ నెల 30న నిర్వహించాల్సిన రైతు ఆశీర్వాద సభ, మెగా రైతు మేళా వాతావరణ పరిస్థితుల కారణంగా రద్దయ్యాయి. రైతుల భద్రత, ప్రజాప్రతినిధుల సౌకర్యం దృష్ట్యా వేదికను మార్చినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. అయితే నిధుల విడుదల తేదీలో మాత్రం ఎలాంటి మార్పు లేదు.
శిల్పకళావేదిక కార్యక్రమంలో వివిధ జిల్లాల నుండి 2500 మంది రైతులు ప్రత్యక్షంగా పాల్గొననున్నారు. మిగతా రైతులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, వ్యవసాయాధికారులు, రైతు సంఘాల ప్రతినిధులు తమ తమ ప్రాంతాల్లోని రైతు వేదికల వద్ద వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కార్యక్రమంలో పాలుపంచుకోనున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 73.32 లక్షల మంది రైతుల ఖాతాల్లో దశలవారీగా రైతు భరోసా నిధులు జమ చేయనున్నారు. తొలి దశలో రెండు ఎకరాల వరకు భూమి గల 41.37 లక్షల మంది రైతులకు రూ.2,482.02 కోట్లు అందనున్నాయి. ఇందులో ఒక ఎకరం వరకు భూమి ఉన్న 14.65 లక్షల మంది రైతులకు రూ.878.94 కోట్లు, రెండు ఎకరాల వరకు భూమి ఉన్న 26.72 లక్షల మంది రైతులకు రూ.1,603.08 కోట్లు ప్రభుత్వం చెల్లించనుంది. మిగిలిన రైతులకు తదుపరి దశల్లో నిధులు అందుతాయి.
కొత్తగా పాస్ పుస్తకాలు పొందిన రైతులు జులై 5లోగా బ్యాంకు ఖాతా వివరాలను సమీప వ్యవసాయ విస్తరణాధికారికి అందజేస్తే, వారికీ ఈ పథకం వర్తించే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ తెలిపింది.