ఖమ్మం రైతు ఆశీర్వాద సభ వాయిదా
జులై 6, 7 లేదా 8న నిర్వహణకు ప్రణాళిక
ఖమ్మం: భారీ వర్షాల నేపథ్యంలో ఈ నెల 30న ఖమ్మం జిల్లా చింతకాని మండలం జగన్నాథపురంలో నిర్వహించాలని భావించిన 'రైతు ఆశీర్వాద సభ'ను ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వం వాయిదా వేసింది. ఈ విషయాన్ని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సోమవారం ప్రకటించారు.
బురదమయంగా సభా ప్రాంగణం
గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా సభా ప్రాంగణం బురదమయంగా మారిందని, దీనివల్ల రైతులు, ప్రజలు, పార్టీ కార్యకర్తలు ఇబ్బందులు పడకుండా ఉండేందుకే సభ తేదీలో మార్పు చేసినట్లు డిప్యూటీ సీఎం వివరించారు. సోమవారం మధ్యాహ్నం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ఆయన సభా ప్రాంతాన్ని పరిశీలించారు.
ముగింపు వేడుకగా నిర్వహణ
మొదట్లో ప్రారంభ సభగా భావించిన ఈ కార్యక్రమాన్ని, ఇప్పుడు రైతు భరోసా పంపిణీ పూర్తయిన తర్వాత మరింత ఉత్సాహంగా ముగింపు వేడుకగా నిర్వహిస్తామని భట్టి స్పష్టం చేశారు. లక్షలాది రైతుల సమక్షంలో ముఖ్యమంత్రి, కేబినెట్ మంత్రులందరి ఆధ్వర్యంలో ఈ సభను ఘనంగా నిర్వహించాలన్నది ప్రభుత్వ యోచనగా ఆయన తెలిపారు.
కొత్త తేదీలపై స్పష్టత
వాతావరణ శాఖ నివేదికల ప్రకారం జులై 3, 4 తేదీల్లో వర్షాలు కొనసాగే అవకాశం ఉందని, దీంతో జిల్లా యంత్రాంగం మరో వారం రోజుల ముందస్తు వాతావరణ సమాచారాన్ని సేకరించాలని ఆదేశించినట్లు ఆయన చెప్పారు. పరిస్థితిని బట్టి వచ్చే 6, 7 లేదా 8వ తేదీల్లో సభ నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. వర్షాలు తగ్గాక వాతావరణ శాఖ నివేదికల ఆధారంగా ముఖ్యమంత్రి, కేబినెట్ తుది నిర్ణయం తీసుకుంటాయని ఆయన పేర్కొన్నారు.