రెవెన్యూ మంత్రి, సీఎస్ తో ఎమ్మెల్యే ఏలూరి భేటీ
ఇనాం ఎస్టేట్ భూముల సమస్యను తీసుకెళ్లిన ఎమ్మెల్యే
అమరావతి,జూలై 14: ఇనాం ఎస్టేట్ భూములకు సంబంధించిన సమస్యలపై పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు రెవెన్యూ శాఖ మంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సాయి ప్రసాద్, సీసీఎల్ఏలతో సచివాలయంలో సమావేశమయ్యారు. వలపర్ల, జంగమేశ్వరపురం, ఏదుబాడు, అగ్రహారం గ్రామాల్లో దశాబ్దాలుగా పరిష్కారం కాకుండా ఉన్న ఇనాం ఎస్టేట్ భూముల సమస్యపై ఈ సందర్భంగా విస్తృతంగా చర్చించారు.
ఈ నాలుగు గ్రామాల్లో ఇనాం ఎస్టేట్ భూములకు సంబంధించి రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు మంత్రి, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సమస్య పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో సమాలోచనలు జరిపారు. రైతుల భూ హక్కులకు సంబంధించిన ఈ వివాదాన్ని సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని ఎమ్మెల్యే ఏలూరి కోరారు.
16న రైతులతో ముఖాముఖి
ఈ సమస్యపై బాధిత రైతులతో నేరుగా చర్చించేందుకు ఈనెల 16న సచివాలయంలో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే ఏలూరి పేర్కొన్నారు. వలపర్ల, జంగమేశ్వరపురం, ఏదుబాడు, అగ్రహారం గ్రామాలకు చెందిన రైతులు ముఖాముఖిలో పాల్గొని సమస్యలను నేరుగా అధికారులకు వివరించేలా ఎమ్మెల్యే ఏలూరి ప్రత్యేక చొరవ చూపారు. ఈ భేటీ ద్వారా దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.